అలిశెట్టి..."సిటీలైఫ్"
కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మి, ఏనాడూ సంపాదనకై ఆరాటపడని అక్షరం అలిశెట్టి ప్రభాకర్. అక్షరాలకు ఆకలి బాధలను, కన్నీటి చుక్కలను, పేదరికపు ఆశలను చూపిన కవి. అలిశెట్టి ప్రభాకర్ గారు కవిగానే కాదు చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా ప్రఖ్యాతులు. జగిత్యాలలో "సాహితీ మిత్ర దీప్తీ" సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. "పరిష్కారం" కవిత 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయిన మొదటి కవిత. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్ గా "సిటీలైఫ్(1992)" ప్రచురించారు.
నగరంలోని మూలలను, మూలాలనూ కవి హృదయం ఎట్లా దర్శించిందో ఈ కవిత మన కళ్ళకు కట్టినట్లు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కన్పిస్తాయి...
"నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?
అదే, నగరారణ్య హోరు
నరుడి జీవనఘోష
తల్లి ఒడివంటి
పల్లెసీమల్నొదిలి
తరలివచ్చిన పేదరైతులూ
ఇనప్పెట్టెల్లాంటి
ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులు
నగరంలో ప్రతిమనిషి
పఠనీయ గ్రంథమే
మరి నీ బతుకు
పేజీలు తిరగేసేదెవరో!"
నగరం నిద్రలేవగానే పరుగెడుతుంది. ఉద్యోగుల ప్రయాణాలతో, కార్మికుల పనులతో, వర్తకుల అరుపులతో బయటికి వచ్చి, దూకే నయాగరా ప్రవాహంలా ఉంది. కూడళ్ళలో నగరం అరణ్యంలోని ద్వని హోరు. నగరజీవి బతుకుపోరాట పోరు.
ఉపాధికోసం కన్నతల్లి ఒడిలాంటి ఊరును వదిలి, విశాల నగరంలో ఊపిరాడని ఇనప్పెట్టెలాంటి మురికివాడల్లో బతుకుతున్నారు పేదరైతులు. నగరంలోని ప్రతిమనిషి చదవవలసిన పుస్తకం లాంటివాడు. కానీ ఆ పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. ఎంతోమంది ఉన్న నగరంలో ఎవరిని ఎవరు పట్టించుకోరని కవి వర్ణించారు.
"సిటీ అంటే అన్నీ
బ్యూటీ బిల్డింగ్ లు కావు
అటు భవంతులూ ఇటు పూరిళ్ళూ
దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలు!
నగరంలో అన్నిపక్కలా
సారించాలి మన చూపులు
మహానగరాల రోడ్లకి
మరణం నాలుగు వైపులు!
నగరం మహావృక్షం మీద
ఎవరికి వారే ఏకాకి!
నగరం అర్థంకాని రసాయనాలు
నగరం చిక్కువీడని పద్మవ్యూహం!!"
చుట్టూ ఎత్తైన భవనాలతో అందంగా కనిపిస్తున్న నగరంలో దారిద్ర్యం, సౌభాగ్యం సమాంతర రేఖలుగా ఉన్నాయి. ధనవంతుల అంతస్తుల పక్కనే పేదల పూరి గుడిసెలు ఉంటాయి.
నగరంలో నిత్యం అప్రమత్తతతో ఉండాలి. అన్నివైపుల ప్రమాదాలు పొంచి ఉంటాయి. నాలుగు దిక్కల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు.
నగరమనే మహా వృక్షం మీద నివసించే ఈ మనుషులనే పక్షులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుగుపొరుగు భావన లేకుండా పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. ఈ మానసిక స్థితిని నిరసిస్తూ ఉన్నాడు కవి.
నగరంలో ఉపాధి దొరకకపోయినా ఏదో ఒక రోజు దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. కాలుష్యం కలవరపెట్టిన ట్రాఫిక్ జామ్ లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా మన పల్లెలకు వెళ్ళనివ్వని, చిక్కుముడి చేదించలేని పద్మవ్యూహం లాంటిది ఈ నగరమనేది.
కవి ఈ విధంగా "సిటీ లైఫ్"కవిత లో నగర జీవన విధానం గురించి వర్ణించారు.
Comments
Post a Comment