బద్దెన సు"మతీ"

      శతకములలో సుమతి శతకం తెలుగువారికి ఇలవేల్పు.  భాష సాహిత్యాలకు శైలికి, నడకకు, శబ్దాలంకారములకు, రీతి తత్వబోధనకు, బోధన విధానమునకు ప్రతీకగా నిలుచున్నది. తెలుగువారికి చాలా సన్నిహితమైన వాటిలో సుమతి శతకం ఒకటి.  సాహిత్యంలో అభిరుచులు మారిన సుమతి శతకం మాత్రం తరతరాలుగా మన వారిని అలరించి, నీతిని అందిస్తుంది.

  ఈ సుమతి శతకాన్ని బద్దెన లేదా  బద్దె భూపాలుడు రచించాడు.  బద్దె భూపాలుడు"నీతిశాస్త్ర ముక్తావళి" అనే గ్రంథాన్ని కూడా రచించినట్టు తెలుస్తుంది. సుమతి శతకం కంద పద్యాలతో ఉంది.ఈయన 13వ శతాబ్దానికి చెందిన వాడు.  సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు సేకరించిన తర్వాత ఈ పద్యాలు సేకరించాడు.  సుమతీ శతకం వేమన శతకం కన్నా ముందే రచింపబడింది.  తెలుగులో మొదటి నీతి శతకము  సుమతీ శతకం.  సుమతి శతకం పై పరిశోధన చేసిన వారిలో మచ్చ హరిదాసు గారు ముఖ్యులు.

   

          "శ్రీరామునిదయచేతను 

          నారూఢిగా సకల జనులు నౌరాయనగా

          ధారాళమైన నీతులు

         నోరూరగ చవులుపుట్ట నుడివెద సుమతీ"


బద్దెన ఈ శతకం ద్వారా తాను చెప్పే నీతులు సమస్త జనులు ఆదరిస్తారని, అందరికీ నచ్చేలా చెప్తానని అంటాడు. 

     ఈ శతకంలో సుమతీ కారుడు ప్రజల పక్షం వహించాడు.  ప్రజల్ని పట్టించుకోని రాజుల్ని నిరసించాడు.  రాజులు అధికారులు ఏ విధంగా ఉండకూడదో, ఏవిధంగా ఉండాలో వివరించాడు.  రాజు ప్రజల కోసమే అని స్పష్టం చేశాడు.  "అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను కొలుచుట వ్యర్థ"మన్నాడు. వెట్టిచాకిరీీ కూడదని ఆనాడే అన్నాడు.  ప్రజల బాధల్ని గోడుని వినేవాడే రాజు అని అన్నాడు.  

    గ్రామ వ్యవస్థలోని కరణాల గురించి సుమతి శతకంలో చెప్పినంత విపులంగా ఎవ్వరు చెప్పలేదు.  కరణాల గురించి కొంత మార్చి చెప్పిన  వారి అక్రమ మార్గాలు కూడా చెప్పాడు.  "కరణము గ్రామా భరణము" అని కరణము ప్రాధాన్యాన్ని వివరించాడు.

          "కరణముల ననుసరింపక 

          విరసంబున తిన్న తిండి వికటించు సుమీ

         ఇరుసున కందెన పెట్టక 

        పరమేశ్వరు  బండియైన పారదు సుమతీ"

     కరణం అందరికీ అవసరమే, అతని చదువు లేనిదే ఏ పని జరగదు అన్న భావన ఉంది. ఆనాటి పరిస్థితుల తీరును శతక కర్త చక్కగా వివరించాడు.  ప్రతి పనికీ కాదనాలి,  తిప్పించుకోవాలి, బధిరత్వం నటించాలి- అలాంటి అతనే కారణంగా రానిస్తాడట!.

    సుమతి శతకంలో  స్త్రీల పట్ల గౌరవం చూపించాడు. పరస్త్రీలను సోదరి భావంతో చూడాలని పలుకుతాడు. భార్యతో చీటికీ మాటికీ గొడవలు వద్దంటాడు.  లేని తప్పులు ఎత్తి చూపిస్తూ స్త్రీల కన్నీరు కు కారణం కాకూడదని వివరించాడు. దానికి స్త్రీల కన్నీరు వలన సంపద తొలగుతుందని నచ్చ చెపుతాడు. వేశ్య గురించి వారి ప్రవర్తన గురించి చక్కగా చెప్పాడు.  వెలయాలి వలపు వేము తియ్యగా ఉండటం అసంభవమని, రొక్కము ఇవ్వకుంటే మన్మధుడు నైనా వేశ్య దగ్గరకు రానివ్వదని, కాబట్టి పరస్త్రీ వ్యామోహం వద్దని హెచ్చరించాడు.

         "కులకాంతల తోడ నెప్పుడు

          కలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ

          కలకంఠ కంటి కన్నీ

          రొలికిన సిరి యింట నుండి నొల్లదు సుమతీ"

     మగువకు మనసు ఇవ్వటం, సతికి మరీచనువు ఇవ్వటం, సతులవలపు నిజము అనుకోవటం సమంజసం కాదని సమయానుకూలంగా చూసుకోవాలని చెబుతాడు. 

     సంస్కృతం లోని నీతి శ్లోకాలను అనుసరించిన విధానం ఉంది ఈ సుమతి శతకంలో.  "కార్యేషు దాసీ కరణేషు మంత్రీ"  అన్న శ్లోకం ఆధారంగా " పని చేయు నెడల దాసియు అనుభవమున రంభ...." అన్న పద్యం వచ్చింది. 

     ఈ శతకంలో కులాల ప్రస్తావన కూడా కనబడుతుంది.  ఆనాటి కులాల గురించి అభిప్రాయాలు స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ శతక పద్యాలు తోడ్పడతాయి. తప్ప కర్తను కుల పక్షపాతి అని, కుల వ్యతిరేకి అని భావించకూడదు.  ఒక చోట కోమటి ఊరికి ప్రాణం అంటాడు.  మరొకచోట కోమటిని నమ్మరాదంటాడు. 

     లోకరీతిని,  జీవిత సత్యాలను, జీవన ధర్మాలను సుఖమయ జీవనానికి తోడ్పడే తత్వాలను ఈ పద్యాలు సూక్ష్మ అర్థంలో తెలుపుతున్నాయి. 

          "ఎప్పుడు సంపద గలిగిన

           నప్పుడు బంధువులు వత్తురదియెట్లన్నం

           దెప్పలుగ చెఱువు నిండిన

           కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ"

బంధువులు, స్నేహితుల స్వభావాలు ఎలా ఉంటాయో చెప్పిన పద్యం ఇది.  అంతేకాకుండా "అక్కరకు రాని చుట్టమును టక్కున విడు" మని చెప్పాడు. అమ్మ అని ఆప్యాయంగా పిలవని నోరు నోరే కాదు " అని అంటాడు.  నిష్కారణంగా నవ్వితే నవ్వుల పాలవుతారని హితవు పలికాడు. శత్రువు ఇంట్లో భోజనం,  ఇతరుల ద్రవ్యం ఉంచుకోవడం మంచిిది కాదు అంటాడు. 

     ఈ కవి స్వభావానికి, భాషకి తగిన చందస్సు ఇది.  ఈ శతకంలోని ఉపమానాలు అందరికీ అనుభవం లోనివే కావటం విశేషం.  అవాస్తవాల జోలికి వెళ్లలేదు. చక్కటి ఉదాహరణలతో సహజంగా ప్రజలు వ్యవహారంలో వాడుకునేలా నీతి సూక్తులు ఈ శతకంలో అందించారు. పదబంధాలు, ఉపమానాలు, లోకోక్తులు, లోక రీతులతో, గంభీరమైన సత్యాల్ని సామాన్యంగా చెప్పటం వల్ల ఈ శతకం ఇంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడింది.  

🙏

          

Comments