చేమకూర "విలాసం"

       ప్రబంధ యుగం అనంతరం సాహిత్యరంగంలోని కాలాన్ని దక్షిణాంధ్ర యుగం.  ఈ దక్షిణాంధ్ర యుగం లో "అభినవ భోజుడు"  గా పేరుగాంచిన రఘునాధ నాయకుని కళానిలయానికి విజయ భవనము అనే పేరు ఉండేది. ఆ విజయ భవనములో ప్రఖ్యాత కవి చేమకూర వేంకటకవి.   రఘునాథ నాయకుడు అంటే అమితమైన భక్తి విశ్వాసాలు గలవారు చేమకూర.  చేమకూర తన రచనలను  రఘునాథ నాయకుని కి అంకితం ఇచ్చాడని తెలుస్తుంది.  అంతేకాకుండా కవి పండితుడు అయినా రఘునాధ నాయకునిచే ప్రశంసలు అందుకున్నాడు.

          "ప్రతి పద్యము నందు చమ

           త్కృతి గలుగంజెప్ప నేర్తు వెల్లెడ బెళుకౌ

           కృతి వింటి ముపారముగా

           క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ"

     ప్రతి పద్యము నీలాగా చక్కని చమత్కారంతో చెప్పు నేర్పు ఈ భూమిపై ఎవరికీ రాదని రఘునాథ నాయకుడు అంతటివాడు చేమకూర వెంకటకవిని ప్రశంసించారు.  

     చమత్కారాలతో చేమకూర వెంకటకవి 'విజయ విలాసం', సారంగధర చరిత్ర రచనలు చేశాడు.  శ్లేషాలంకారమును విరివిగా తన రచనల్లో ఉపయోగించారు.  సాహిత్యంలో నూతన ప్రయోగాలు చేసి తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు.  విజయ విలాసంలో అర్జునుడు ఉలూచి, చిత్రాంగద ,సుభద్రలను వివాహమాడే ఇతివృత్తాలు ఉన్నాయి.  

     విజయ విలాసం మూడు ఆశ్వాసాల రమ్యమైన ప్రబంధం. అద్భుతమైన కల్పనలతో ఎంతో రమణీయంగా తీర్చిదిద్దిన కావ్యం.  చేమకూర రచనా సౌందర్యాన్ని శబ్దాలంకారాలు సార్థకంగా వాడటం, తెలుగు పలుకుబడుల తో విశ్లేషణలు,  కొత్త సొంపులు ఈ కావ్యంలో విశేష రచన. 

     నాగ కన్య అయిన ఉలూచి అర్జునని తన వాక్ నైపుణ్యంతో వశం చేసుకున్న ప్రౌఢ.  అర్జునుడి సౌందర్యానికి ఉలూచి ముగ్దురాలై ఇలా అంటుంది.

  "కమ్మని జాళువా నొరయగల్గిన చెక్కుల టెక్కువాడు చొ

   క్కమ్మగు జాతికెంపు వెలగా గొనుమోవి మెరుంగవాడు స

  త్యమ్ముగ రూప సంపద ధనాధిపసూనుని ధిక్కరించు వా

  డమ్మకచెల్ల! నా హృదయ మమ్మక చెల్లదువీనికియ్యెడన్"

        'అమ్మకచెల్ల' పద ప్రయోగంలో యమకం రమణీయమే కాదు అర్థవంతం కూడా.  ఇటువంటి చమత్కారాలు చేమకూర కి వెన్నతో పెట్టిన విద్య.

          "నా హితంబొన గూరిచి

          నా దుహితం బెండ్లి సేయు నరనాథునకున్"

సన్యాసిగా ఉన్న అర్జునునికి పరిచర్యలు చేయటానికి బలరాముడు సుభద్ర అని వినియోగించాడు.అప్పడు అర్జునుడు సుభద్రను చూసి మైమరిచిన విధానాన్ని చేమకూర ఎంత అందంగా వ్యక్తపరిచాడో:

     "వెలది కెమ్మానిగని జపావృత్తి మరచె

      తరుణీ లెగౌను గాని హరి స్మరణ మరచె

      గడమ యననేల? వేస మొక్కటి తక్క

      మరచి నన్నియు నా కృత్రిమ త్రిదండి!"

 సుభద్ర ని చూడగానేే అర్జునుడు ముని లా మారువేషంలో ఉన్న  సంగతిమరచి హరినామజపం చేయటం మరిిిిిచాడు.  అర్జునుడి అవస్థను చక్కగా చెప్పాడు కవి.  

      సుభద్ర సౌందర్యాన్ని తెలుగు రాత కి సంబంధించిన  దీర్ఘము,తలకట్టు, గుడి, సున్నా అనే విశేషాలను ప్రయోగిస్తూ ఎంతో నేర్పు చూపాడు.

"కన్నులు ధీర్ఘములు, నాకు మొగంబవురా తలకట్టు తమ్మిపూ 

పున్నమ చందమామకు పొక్కిలి (గుడి) చక్కదనంబు జెప్పగా

నున్నదె మేలు బంతులు పయోధరముల్ మరికౌను సున్నయౌ

నెన్నిక కెక్కు వ్రాతఫల మిల్లర్ వర్ణిని కన్నిజంబుగన్"

    సుభద్ర కన్నులు దీర్ఘములని, నవ్వు తలకట్టు అని, జడలోని పువ్వు చందమామకు పెట్టిన గుడి అని, నడుము సున్నా అని చమత్కారంతో చేమకూర వర్ణించిన తీరు.  

చేమకూర వెంకటకవికి శ్లేష కవితా ప్రవీణుడు అనే బిరుదుకు మంచి ఉదాహరణ ఈ పద్యం--

    "భ్రమరకమనోహరం బౌట పద్మమగును

    తారకహృద్యమగుట సుధానిధి యగు

    రెంటి జగడాలు మోమున వంటి యుంట

    నబ్జముఖి యంటలెస్స యీ అలరు బోడి!"

సుభద్ర ముంగురులు తుమ్మెదలు. కన్నులు నక్షత్రాలు. తుమ్మెదల వల్ల ఆమే ముఖం పద్మమా? చంద్రుడు వల్ల కలువ పువ్వా? అని పడే  ఆమె  జగడాల సమయంలో 'అబ్జముఖి' అని వెంకట కవి చమత్కారం.  

    అనుప్రాస అలంకారం తో పాఠకుల్ని ప్రసన్నం చేసే విధంగా--

    "అన్నన్న మొగము వెన్నుని

     యన్నన్న జయించు, కన్నులన్నన్న వినా

    సన్నములు నడుము మిక్కిలి

    సన్నము, మాటలు సుధా ప్రసన్నములెన్నన్"

  ఇటువంటిి చమత్కారాలు విజయ విలాసంలో ఎన్నో ఉన్నాయి.  అల్ప అక్షరాలతో విశిష్ట అర్ధాన్నిరచించేే నేర్పు  ఉంది. విజయ విలాసంలో సామెతలు, లోకోక్తులు,   జాతీయాలు సమయోచితంగా ప్రయోగించారు.  

మనముననున్నది మొగమున కనిపించున్"

" చదువగ పెట్ట నున్న మతియు పోయే"

ఇలాంటి లోకోక్తులు విరివిగా ఈ కావ్యంలో ఉన్నాయి.  ఒక పద్యమే లోకోక్తులతో ఉంది:

"శివుడి టురమ్మటంచు దయచేసినచో తలకెక్కి తుగ్రవై

భవమున జూచుచో  నడుగు వెట్టితి వేమనవచ్చు నీ గుణం

బవునవునందినన్ సిగయు నందక యున్నను కాళ్ళు పట్టుకొం

దువు హరిణాంక వేల కొలదుల్ గద నీనడకల్ తలంపగన్"

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న సామెతను అనుసరించిన పద్యం ఇది.

  చేమకూర వెంకట కవి యొక్క రచనా శైలికి అబ్బురపడి కొందరు కవులు ప్రశంసించిన తీరు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

 "ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉంటుంది"

   "చేమకూర పాకాన పడింది"

  "చక్కెర మడిలో అమృతం పారించి పండించిన చేమకూర" 

  కానీ చేమకూర వెంకటకవి మాత్రం సమకాలిన కవుల ప్రశంసలు పొందటం చాలా కష్టం భావించి " ఏ గతిరచించిన నేమి సమకాలము వారలుమెచ్చరు గదా " అని వాపోయాడు. 

  వెంకట కవి రఘునాధ నాయకుని మెప్పు పొందు కవులు ఇలా ఉండాలని  సూచిస్తున్న పద్యం అతనినే ప్రతిబింబించింది.

"తారసపుష్టియై ప్రతి పదమ్మున జాతియు వార్తయున్ చమ

త్కారము నర్థగౌరవము కల్గననేక కృతుల్ ప్రసన్న గం 

బీరగతిన్ రచించి మహిమించినచో నికశక్తులెవ్వర

య్యా! రఘునాథభూప రసికాగ్రణికింజెవి సోక జెప్పగన్"

     

🙏

Comments